వరంగల్​ట్రై సిటీలో ట్రాఫిక్ మళ్లింపు

 వరంగల్​ట్రై సిటీలో ట్రాఫిక్ మళ్లింపు

హనుమకొండ, వెలుగు: సీఎం రేవంత్​రెడ్డి పర్యటన నేపథ్యంలో వరంగల్​ట్రై సిటీలో పోలీసులు ట్రాఫిక్​ ఆంక్షలు విధించారు. ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో లక్ష మందితో బహిరంగ సభ ఉండటంతో ట్రాఫిక్​ఇబ్బందులు తలెత్తకుండా వాహనాలను మళ్లిస్తూ వరంగల్ సీపీ అంబర్​కిశోర్​ ఝా పలు సూచనలు చేశారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం మీటింగ్​ముగిసేంత వరకు ట్రాఫిక్​ఆంక్షలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు. 

ట్రాఫిక్ మళ్లింపు ఇలా..

కరీంనగర్, పరకాల, ములుగు వైపు నుంచి హైదరాబాద్, ఖమ్మం వైపు వెళ్లే వాహనాలు చింతగట్టు రింగ్​రోడ్డు, కరుణాపురం మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. పరకాల, ములుగు వైపు నుంచి కరీంనగర్ వైపు వెళ్లే వెహికిల్స్​రింగ్​రోడ్డు మీదుగా వెళ్లాలి. 

ఖమ్మం, వర్ధన్నపేట వైపు నుంచి హైదరాబాద్, కరీంనగర్, ములుగు, పరకాల వైపు పోయే వాహనాలు పున్నేలు క్రాస్ నుంచి డైవర్షన్ తీసుకుని ఐనవోలు, కరుణాపురం, రింగ్​రోడ్డు మీదుగా వెళ్లాలి.

ప్రజాపాలన విజయోత్సవ సభకు వచ్చే వాహనాలకు రూట్​..

హుజూరాబాద్ వైపు నుంచి వచ్చే వెహికల్స్​చింతగట్టు రింగ్​రోడ్డు మీదుగా ఉనికిచర్ల క్రాస్ రోడ్, వడ్డేపల్లి చర్చి, రిజిస్ట్రేషన్ ఆఫీస్, తెలంగాణ జంక్షన్ నుంచి సర్క్యూట్ గెస్ట్ హౌస్ వద్ద ప్రజలను దింపి, ఖాళీ వాహనాలను ఓల్డ్ బస్ డిపో వద్ద పార్కింగ్ చేయాలి. 

ములుగు, భూపాలపల్లి వైపు నుంచి వచ్చే వాహనాలు పెద్దమ్మగడ్డ, కేయూ జంక్షన్, వంద ఫీట్ల రోడ్ మీదుగా తిరుమల జంక్షన్, ఎక్సైజ్ కాలనీ ఐలాండ్ వద్ద జనాలను దించి, వాహనాలను ఎక్సైజ్ కాలనీ-1 లో పార్కింగ్ చేయాల్సి ఉంటుంది.

నర్సంపేట వైపు నుంచి వచ్చే వాహనాలు చింతల్ బ్రిడ్జి నుంచి ఆర్టీఏ ఆఫీస్​జంక్షన్​మీదుగా హంటర్ రోడ్, నీలిమా జంక్షన్, తెలంగాణ జంక్షన్ వద్ద ప్రజలను దించి, అక్కడున్న ప్రదేశంలో పార్కింగ్ చేయాలి. 

మామునూరు నుంచి వచ్చే వాహనాలు ఆర్టీఏ జంక్షన్, ఉర్సు గుట్ట, సీఎస్​ఆర్​గార్డెన్స్ మీదుగా హంటర్ రోడ్, నీలిమా జంక్షన్, తెలంగాణ జంక్షన్ వద్ద దించి ఖాళీ వాహనాలను విష్ణుప్రియా గార్డెన్స్ పార్కింగ్ చేయాలి. 
    
స్టేషన్​ ఘన్​ పూర్​వైపు నుంచి వచ్చే వాహనాలు రింగ్​రోడ్డు మీదుగా ఉనికిచెర్ల ఎక్స్ రోడ్, వడ్డేపల్లి చర్చి, ప్రశాంత్​నగర్ పార్క్, తెలంగాణ జంక్షన్ మీదుగా ఏ టూ జడ్​సెంటర్​వద్ద దించి ఖాళీ వాహనాలను తెలంగాణ జంక్షన్ వద్ద  పార్కింగ్​చేయాలి.